Thursday, November 15, 2018

Tiruvarur - Kamalapuram/Kamlalayam

  
              మనకు పెద్దలు చెప్పిన ఒక శ్లోకం ప్రకారం- కాశ్యాంతు మరణం, దర్శనాత్ అభ్రసదసి, స్మరణాత్ అరుణాచలం, జననాత్ కమలాలయే- ఇవి ముక్తి ప్రదములు. అనగా కాశీలో మరణం, చిదంబరంలో స్వామిని సరైన విధంగా దర్శించగలగడం, అరుణాచల స్మరణ, కలమలాలయంలో జననం ఇవి ముక్తిని ఇస్తాయి అని అర్థం. వీటిలో చెప్పబడిన ఈ కమలాలయమే ’తిరువారూర్’.
                     Thiruvarur temple


                     Thiruvarur Thyagaraja              
  ఇది తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. దీనినే కమలాపురం అని కూడా అంటారు. ఇక్కడి ప్రధాన దైవం త్యాగరాజేశ్వరుడు అని చెప్పబడుతున్నా ఎన్నో పురాణ గాథలు దీని వైశిష్ఠ్యాన్ని ప్రస్తావించే సందర్భంలో ఇతర ముఖ్య దైవ స్వరూపాలను కూడా విశేషంగా పేర్కొన్నాయి. వల్మీకేశ్వరుడు, సోమాస్కంద మూర్తి, కమలాంబిక...ఇలా మరిన్ని స్వరూపాల గురించి ఇక్కడ మనకు దొరికినంత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

                 ముందుగా మాకు మా గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ’షణ్ముఖ వైభవం’ ప్రవచనంలో ఈ క్షేత్ర ప్రస్తావన, దీనికి సంబంధించిన ఒక  గాథ వారి అనుగ్రహంగా తెలియచేసారు. దానితో పాటు ఇతర గాథలు కూడా కలుపుకుని మరిన్ని వివరములు సేకరించే ఈ ప్రయత్నానికి మా గురువుల ఆశీస్సులు పరిపూర్ణతను ఇస్తాయి అని వారి పాదములు పట్టి ప్రార్థిస్తున్నాను.

           ఒక సారి ఇంద్రునికి రాక్షసులతో యుద్ధం రాగా ఆ సమయంలో ఇంద్రునికి ముచికుందుడు సహాయం చేసాడు. దానికి ప్రతిగా ఇంద్రుడు అతనికి ఏమి కావాలని అడుగగా, ఇంద్రుడు పూజించే సోమాస్కంద మూర్తి కావాలని కోరుతాడు ముచికుందుడు. కొంతకాలం విష్ణువు పూజించి తరువాత ఇంద్రునికి ఇచ్చిన సోమాస్కందమూర్తి అది. దానిని ముచికుందునికి ఇవ్వడానికి ఇష్టపడని ఇంద్రుడు రాత్రికి రాత్రి దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి ఆ మూర్తిని అచ్చంగా పోలి ఉండే మరో ఆరు మూర్తులను తయారు చేయిస్తాడు. కానీ శివుని అనుగ్రహంతో ముచికుందుడు అసలు మూర్తిని గుర్తించగలగడంతో ఇంద్రునికి దానిని ఆయనకు ఇవ్వక తప్పలేదు. అలా పొంది పూజించిన సోమాస్కందమూర్తినే ముచికుందుడు తిరువారూర్‍లో ప్రతిష్ఠించాడు. ఈ మూర్తినే ’వీధి విడంగర్’ అని పిలుస్తారు.

         మిగిలిన ఆరు- తిరునల్లార్‍లోని నాగర్ విడంగర్, నాగపట్టణంలో సుందర విడంగర్, తిరుకువలయైలో అవని విడంగర్, తిరువాయిమూర్‍లో నీల విడంగర్, వేదారణ్యంలో భువని విడంగర్, తిరుకరవసల్‍లో ఆది విడంగర్ పేరుతో త్యాగరాజ స్వామి ఈ ఏడు ప్రాంతాలలో పూజలు అందుకుంటున్నారు. వీటినే సప్త విడంగ స్థలములు అంటారు.

            ఈ క్షేత్రం పంచభూతాలలో పృథ్వీ స్థానం. ఇక్కడ జన్మించిన వారికి మోక్షం తథ్యమని ప్రగాఢ విశ్వాసం. శివ భూతగణాలే ఈ ప్రాంతంలో జన్మిస్తారని విశ్వాసం. సుందరార్ తన తేవారంలో ”తిరువారూర్‍లో జన్మించిన వారందరికీ నేను బానిసను”అని ఈ స్థల ప్రాశస్త్యాన్ని కీర్తించారు. తొమ్మిది రాజగోపురాలు, ఎనభై విమానములు, పదమూడు మంటపాలు, పదిహేను పవిత్ర బావులు, మూడు పువ్వుల తోటలు, మూడు పెద్ద ప్రాకారాలు, వెయ్యికి పైగా ఉపాలయాలతో ఈ దేవాలయం ఎంతో విశాల ప్రాంగణంలో కొలువై ఉంది. సాధారణంగా శివాలయాలలో ఉండే విధంగా చండికేశ్వరునితో పాటు యముడు తనకు ఇక్కడ ఏమీ పని లేదని చెప్పడంతో ఆయనను కూడా చండికేశ్వరుని స్థానంలో ఉండమనడంతో యమ చండికేశ్వరుడు అనే పేరుతో కొలువై ఉన్నారు.

            ఇక్కడి అమ్మవారు కమలాంబికా అమ్మవారు కాలుపై కాలు వేసుకుని ఠీవిగా కూర్చుని ఉంటారు. ఇటువంటి భంగిమలో అమ్మవారు మనకి ఇంకెక్కడా కనబడరు. ఈ స్థితిలో కూర్చుని అమ్మవారు శివుని ధ్యానిస్తూ ఉంటారని, కామంపై విజయం సాధించిన దానికి ఇది నిదర్శనం అని భక్తుల విశ్వాసం.

  వాల్మీకనాథుడు అనే పేరుతో ఇక్కడ కొలువైన శివుడు ఒక పుట్టలో వెలసిన స్వామి అని, దేవతల ప్రార్థనననుసరించి ప్రత్యక్షమైన ఈ స్వామికి ఏ విధమైన అభిషేకం ఉండదు. అనంతీశ్వరుడు, నీలోత్పలాంబ, అసలేశ్వరుడు, అడగేశ్వరుడు, వరుణేశ్వరుడు, అన్నామలేశ్వరుడు మొదలైన ఉపాలయాలు కూడా దర్శించుకోవచ్చు. ఇతర శివాలయాలలో మాదిరిగా కాకుండా ఇక్కడి నంది స్వామి పట్ల తన గౌరవాన్ని చూపుతూ నిలబడి ఉంటారు. ఇక్కడి మరకత లింగ అభిషేకం నేత్రానందం కలిగించేదిగా ఉంటుంది. ఆరు కాలాలలో ఇకడి శివునికి ఆరాధన జరుగుతుంది.

                         శివుడు శివ భక్తిని ప్రజలలో విస్తరింపచేసే సంకల్పంతో తన ప్రతిరూపంగా సృష్టించి భువికి పంపిన సుందరార్ అనే భక్తుని వృత్తాంతం ఈ క్షేత్రంతో ఎంతో ముడి పడి ఉంది. ఆయన మొదటి భార్య పరవై నచియార్ ఈ ఊరి నివాసి. ఒకనాడు శివుడు సర్వాలంకార భూషితుడై ఉంటే చూడాలని తపించిన దేవతల కోసం, అమ్మవారి కోసం ఆ రూపంతో వారి ఎదురుగా వచ్చి ఆనందింపచేస్తాడు. పార్వతీ దేవి చెలికత్తెలను ఇద్దరిని చూసి కాసింత మోహానికి గురి అయిన సుందరుని, ఆ ఇద్దరు చెలికెత్తెలను భూమిపై జన్మించవలసిందిగా శాపానుగ్రహం ఇస్తాడు శివుడు. అలా జన్మించినవాడే సుందరుడు. ఆయన ఆ చెలికత్తెలలో ఒకామె అయిన పరవైను వివాహం చేసుకున్న అనంతరం తిరువొట్రియూర్‍లో జన్మించిన సంగిలి (శృంఖల) నచియార్‍ను రెండవ భార్యగా స్వీకరిస్తాడు. ఆమెకు చేసిన ప్రతిజ్ఞను ఉల్లంఘించి తిరువొట్రియూర్ వీడి వెళ్ళి తన రెండు కళ్ళు పోయి అంధుడైపోతాడు. కంచి ఏకామ్రనాథుని అనుగ్రహంతో ఎడమ కంటి దృష్టిని తిరిగి పొంది మరల తిరువారూర్ చేరుకున్నాడు. ఇక్కడి త్యాగరాజేశ్వరుని అనుగ్రహంతో రెండవ కన్నుకు కూడా తిరిగి దృష్టిని పొందాడు కానీ మొదటి భార్య అయిన పరవై నచియార్ అతని ముఖం చూడడానికి కూడా ఇష్టపడదు. అప్పుడు సాక్షాత్తు శివుడే ఒక పురోహితుని రూపంలో వారిద్దరి మధ్యలో దౌత్యం నడిపి, అది ఫలించకపోవడంతో తన స్వస్వరూపంతోనే పరవై వద్దకు వెళ్ళి చివరకు వారిద్దరినీ కలుపుతాడు.

           ఈ వృత్తాంతం అంతా ఈ క్షేత్రం చుట్టూనే తిరుగుతుంది. ఇప్పటికీ దీని ఆనవాళ్ళు ఈ ఊరిలో చుడవచ్చు.

    ఈ దేవాలయంలో కనిపించే కొలనునే కమలాలయం అని పిలుస్తారు. ఇది అతి విశాలమై సుందరమై దర్శనమిస్తుంది. ఒక సారి సుందరునికి వృద్ధాచలంలో దేవాలయానికి చేసిన సేవలకు గాను పన్నెండు వేల బంగారు కాసులు బహూకరించగా వాటిని దొంగల బారిన పడకుండా తిరువారూర్ తీసుకుని రావడం ఎలాగా అని ఆలోచించాడు. శివుడు వాటిని వృద్ధాచలం ఆలయ కొలనులో వేసి తిరిగి తిరువారూర్ ఆలయ కొలనులో తీసుకొమ్మని ఆజ్ఞాపిస్తాడు. తిరువారూర్ చేరి కొలను వద్ద పత్తికాలు పాడుతూ ఉన్న సుందరునికి ఆ కాసులు యథాతథంగా తిరిగి చేరుతాయి, కాని సుందరుడు వాటి నాణ్యతను శంకిస్తాడు. సాక్షాత్తు శివుడే చెప్పినా నమ్మక తన వద్ద ఉంచిన ఒక కాసుతో ఈ కొలనులో తీసుకున్న కాసులను పోల్చి పరీక్షిస్తాడు. ఈ దేవాలయంలో కొలువున్న మాతృ ఉరైత వినాయకుని ఈ పరీక్షకు సాక్షిగా ఉంచి కొలనులో తిరిగి వచ్చిన కాసుల నాణ్యత తక్కువగా ఉందని చెబుతాడు. తనకు అసలు కాసులు కావాలని కోరుతూ తిరిగి పత్తికాలు పాడడం మొదలు పెడతాడు. సుందరుని నోట పత్తికాలు పాడించాలనే ఉద్దేశ్యంతోనే శివుడు ఈ లీల చేసి తిరిగి అతనిని కోరిన రీతిలో అనుగ్రహిస్తాడు.

    తిరువారూర్ ప్రాంతాన్ని మనునీతి చోళుడు అనే రాజు కొంతకాలం పరిపాలించాడు. అతని కుమారుడు రథంలో వస్తుండగా ఒక దూడ అతని రథం క్రింద పడి మరణిస్తుంది. రాజు వద్దకు వెళ్ళి న్యాయం కోరిన ఆవుకు అభయం ఇచ్చిన రాజు దూడ ప్రాణాలు తీసిన పాపానికి ఆ రాజకుమారుని కూడా రథ చక్రాల క్రింద చంపవలసిందిగా శిక్షను ఖరారు చేసి అమలుపరుస్తాడు. ఆ రాజు ధర్మ నిరతికి ప్రీతి నందిన యముడు తన స్వస్వరూపంతో ప్రత్యక్షమై రాజును అనుగ్రహిస్తాడు. దీనికి గుర్తుగా ఇప్పటికీ రాతి రథంపై ఈ గాథ అంతా కళ్ళకు కట్టినట్టు చెక్కి ఉండి దర్శనమిస్తుంది.

   ఈ దేవాలయంలో ఉన్న రథం తమిళనాడులోనే ఎంతో ప్రఖ్యాతమైనది, అందమైనది. 
                         Thiruvarur ther

                 మహాలక్ష్మీ దేవి విష్ణువును పెండ్లియాడాలని ఇక్కడి మూలస్థానేశ్వరుని ఉద్దేశించి తపస్సు చేసింది. అందుకే ఇక్కడి కోనేరుకు కమలాలయం అని పేరు వచ్చింది. ఈ కోనేరు ఆలయమంత పెద్దది, ముప్పై మూడు ఎకరాలలో విస్తరించి ఉండి దేశంలోనే పెద్దదిగా ప్రసిద్ధినొందింది. కొలను మధ్యలో ’నాదువన నాథుని’ ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడి ప్రదోష అభిషేకం చాలా విశేషంగా ఉంటుంది. 
                        Image result for thyagaraja temple, tiruvarur
మొత్తం ఇక్కడ ఉన్న అరవై నాలుగు తీర్థాలు ఒక్కొక్కటీ ఒక్కొక్క ప్రశస్తిని కలిగి భక్తులను అనుగ్రహిస్తున్నాయి. వాటి వివరాలు ఆయా ఘాట్‍ల వద్ద వ్రాయబడి ఉన్నాయి. పడమటి గోపురానికి ఎదురుగా ఉన్న ’దేవనీర్థ కట్టం’ అన్నింటిలోకి విశేషమైనదని ప్రశస్తి.

            సంగీత త్రయంగా ప్రసిద్ధినొందిన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి ముగ్గురూ ఈ గ్రామంలోనే జన్మించారు. వారి ఇండ్లను కూడా మనం వెళ్ళి దర్శించవచ్చు. 
                  Image result for thyagaraja temple, tiruvarur

  సాయంకాల సమయంలో ఇక్కడ జరిగే ప్రదోష పూజా చాలా విశేషమైనది. సాక్షాత్తుగా దేవేంద్రుడే ఆ సమయంలో ఇక్కడకు వచ్చి స్వామిని పూజిస్తాడని, మొత్తం దేవ గణమంతా దానిలో పాల్గొంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.